
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా పేరు తాజాగా క్రిప్టో కుంభకోణం కేసులో వినిపిస్తోంది. 2022లో కోయంబత్తూరులో ప్రారంభమైన క్రిప్టో కంపెనీ పెట్టుబడిదారులను రూ.2.40 కోట్లు మోసం చేసింది అని ఫిర్యాదు అందింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అశోకన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నితీష్ జైన్ (36), అరవింద్ కుమార్ (40) అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కంపెనీ ప్రారంభోత్సవానికి తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు, అందుకే ఆమె పేరు కూడా ఈ కేసులో జొరబడింది.
ఈ ఆరోపణలపై తమన్నా సీరియస్‌గా స్పందిస్తూ, ఇవి పూర్తిగా తప్పుడు పుకార్లు అని ఖండించారు. తనకు క్రిప్టోకరెన్సీ, సంబంధిత కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంచేశారు. అంతేకాకుండా, మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరుతూ, దూషణలు, అపవాదులు వ్యాప్తి చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆమె తెలిపారు.
ఈ వ్యవహారంలో కాజల్ అగర్వాల్ పేరు కూడా తెరపైకి రావడం ఆసక్తికరం. కాగా, పుదుచ్చేరి పోలీసులు తమన్నా, కాజల్‌లను విచారించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కానీ, ఇప్పటివరకు ఏదైనా అధికారిక నోటీసులు పంపించారా లేదా అన్నది తెలియరాలేదు.
క్రిప్టో మోసం కేసు వేగంగా మలుపులు తిరుగుతుండటంతో ఇంకా ఎవరెవరిని విచారిస్తారో చూడాలి. తమన్నా ఇప్పటికే తన లీగల్ టీమ్ ద్వారా కఠినంగా స్పందించేందుకు సన్నద్ధమవుతున్నారు.