
సినీ పరిశ్రమలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కన్నడ నటి రన్యా రావ్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నట్లు DRI (Directorate of Revenue Intelligence) అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం, రన్యా రావ్ గత 27 సార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా, ఆమె ప్రతి సారి ఒకే డ్రెస్సుతో ప్రయాణం చేయడం, దాన్లోనే అక్రమంగా బంగారాన్ని దేశానికి తరలించడం పోలీసులకు అనుమానాన్ని కలిగించింది.
గత 15 రోజుల్లోనే 4 సార్లు మరియు 2 నెలల్లో 10 సార్లు ఆమె దుబాయ్‌కి వెళ్లొచ్చినట్లు గుర్తించారు. ఒక్కో ట్రిప్పులో రన్యా రావ్ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సంపాదించేదని అధికారులు వెల్లడించారు. ఈ అక్రమ వ్యవహారంతో ఆమె నెలకు రూ.1 కోటి నుంచి రూ.3 కోట్లు వరకు ఆదాయం ఆర్జించినట్లు విచారణలో వెల్లడైంది.
కేవలం దుబాయ్ మాత్రమే కాకుండా, యూరప్, అమెరికా లాంటి ఇతర దేశాలకు కూడా ఆమె తరచూ ప్రయాణించినట్లు సమాచారం. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఈ నటి కీలకమైన వ్యక్తిగా మారిందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక లావాదేవీలను గమనిస్తూ, మరిన్ని వివరాలను వెలికి తీయడానికి DRI అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు ఉన్న కాంటాక్టులు, మరెవరైనా ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వాములా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. త్వరలో రన్యా రావ్‌పై మరింత క్లారిటీ రానుంది.