
తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ దివ్య భారతి. కోయంబత్తూరు లో జన్మించిన ఆమె, మోడలింగ్ ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రం “బ్యాచిలర్” లో జివి ప్రకాశ్ సరసన నటించి, ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత “మదిల్ మేల్ కాదల్” సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ రావ్ తో కలిసి నటించింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన కాలేజీ రోజుల్లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ అనుభవాలను దివ్య భారతి షేర్ చేసింది. “నా శరీర ఆకృతిని చూసి ‘ఫాండా బాటిల్ స్ట్రక్చర్’, ‘స్కెలిటన్’, ‘బిగ్ బట్ గర్ల్’ లాంటి పేర్లు పెట్టి ఎగతాళి చేసేవారు. దాంతో నా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. నేను నా శరీరాన్ని ద్వేషించడం ప్రారంభించాను,” అని తెలిపింది.
అయితే, 2015లో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మోడలింగ్ ప్రయాణం ప్రారంభించింది. ఆ సమయంలో పోస్ట్ చేసిన ఫోటోలకు మంచి స్పందన రావడంతో తనపై ఉన్న నెగటివ్ ఫీలింగ్ తొలగించుకుందట. “ప్రతి ఒక్కరి శరీర ఆకృతి భిన్నంగా ఉంటుంది. దాన్ని అంగీకరించుకోవడమే ముఖ్యమని ఇప్పుడు అర్థమైంది” అని పేర్కొంది.
ప్రస్తుతం దివ్య భారతి కొన్ని ఆసక్తికరమైన సినిమాల లో నటించనుంది. ఆమె టాలెంట్, గ్లామర్ చూసి దర్శకులు కొత్త ప్రాజెక్టుల కోసం సంప్రదిస్తున్నారట. త్వరలోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.