
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలై, తొలి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని, విక్కీ కౌశల్ ఆయన పాత్రలో అద్భుతంగా నటించారు.
రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వంలో, దినేష్ విజన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల ‘ఛావా’ను ఆధారంగా తీసుకుంది.
‘ఛావా’ చిత్రం విడుదలైన కొద్ది రోజులలోనే రూ. 200 కోట్ల మార్కును దాటి, 2025లో అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా చరిత్రలో చాలామందికి తెలియని మహారాజు శంభాజీ మహారాజ్ జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.
సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఇటీవల, 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ‘ఛావా’ చిత్రాన్ని ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ, “మరాఠీ భాష గొప్ప సాహిత్యాన్ని అందించిందని, ‘ఛావా’ చిత్రం అందులో ఒక ముఖ్యమైన భాగమని” అన్నారు.