
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న ‘దండోరా’ (Dhandoraa) సినిమా సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న అసమానతలను ఎత్తి చూపించే చిత్రం. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ, మనీక చిక్కాల, అనూష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ బీట్ గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఆధారంగా రూపొందించిన ఈ కథలో పురాతన సంప్రదాయాలు, సామాజిక అసమానతలు, హాస్యం, భావోద్వేగాలు మేళవించి తెరకెక్కించారు. ఇంటర్‌కాస్ట్ పెళ్లిళ్లకు ఎదురు ఎదురైన సమస్యలు, అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమించుకున్నప్పుడు ఎదురయ్యే హింసాత్మక సంఘటనలు ఈ సినిమాలో ప్రధానాంశంగా ఉంటాయి. ‘నేటి ఆధునిక యుగంలోనూ ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయా?’ అనే సందేహాన్ని చిత్ర కథ కలిగిస్తుంది.
ఈ సినిమాకు వెంకట్ ఆర్. శాకమూరి అందించిన సినిమాటోగ్రఫీ పల్లెటూరి స్వభావాన్ని సహజంగా చూపిస్తుంది. మార్క్ కె. రాబిన్ సంగీతం కథను మరింత భావోద్వేగంగా మారుస్తుంది. గ్యారీ బి. హెచ్ ఎడిటింగ్, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్షన్, రేఖ భోగవరపు కాస్ట్యూమ్ డిజైనింగ్ వంటి టాప్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాను మరింత అద్భుతంగా మలిచేందుకు కృషి చేశారు.
సమాజంలోని చేదు నిజాలను చక్కటి కథనంతో అందించబోతున్న ఈ చిత్రం ఆలోచింపజేసే, వినోదం పంచే చిత్రంగా ఉండనుంది. సినిమా విడుదల వివరాల కోసం వెయిట్ చేయండి, మరిన్ని అప్‌డేట్స్ త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.