సరిపోదా ఒక్క సినిమా అంటే.. సరిపోదు నాకంటున్నారు నాని. ఓ సినిమా సెట్స్‌పై ఉన్నపుడే కనీసం మూడు నాలుగు బ్యాకప్ ఉండాలంటున్నారు. పైగా దానికి కూడా పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు న్యాచురల్ స్టార్. గతంలో తనతో పని చేసిన దర్శకులనే రెండోసారి లాక్ చేస్తున్నారు ఈ హీరో. ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను కూడా వదిలేలా కనిపించట్లేదీయన.
బిజీ అనే పదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు నాని. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని జోరు మరింత పెరిగింది. గ్యాప్ అనేదే లేకుండా దూసుకుపోతున్నారు న్యాచురల్ స్టార్. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు నాని. ఆగస్ట్ 29న విడుదల కానుంది ఈ చిత్రం. అంటే సుందరానికి తర్వాత వివేక్‌తో నాని చేస్తున్న రెండో సినిమా ఇది.
ఓ సినిమా చేస్తున్నపుడే.. అదే దర్శకుడితో రెండో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారు నాని. గతంలో ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ లాంటి దర్శకులతో అలాగే మరోసారి పని చేసారు నాని. ఇప్పుడు వివేక్ ఆత్రేయతోనూ కాంబో రిపీట్ అవుతుంది. ఇక దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతోనూ రెండో సినిమాను ప్రకటించారు న్యాచురల్ స్టార్. తాజాగా హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలనుతోనూ సినిమా కమిటయ్యారు నాని.
సరిపోదా శనివారం తర్వాత సుజీత్‌తో అనుకున్న సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. దాంతో 2025లో ప్లాన్ చేసిన హిట్ 3ను ముందుకు తీసుకొస్తున్నారు నాని. ఇప్పటికే శైలేష్ కథ సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యారు. వెంకటేష్‌తో తెరకెక్కించిన సైంధవ్ ఫ్లాప్ అయినా.. శైలేష్ టాలెంట్‌పై నమ్మకం పెట్టుకున్నారు నాని.
శైలేష్‌ను దర్శకుడిగా పరిచయం చేసింది నానినే. ఆయన వాల్ పోస్టర్ సినిమాలోనే హిట్ సినిమా తెరకెక్కించారు శైలేష్. ఆ తర్వాత హిట్ 2 వచ్చింది.. ఇప్పుడు హిట్ 3 రాబోతుంది. దీంతో పాటు శ్రీకాంత్ ఓదెల, బలగం ఫేమ్ వేణు, సుజీత్ లైన్లో ఉన్నారు. ఈ మూడు సినిమాల తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో సినిమాకు రెడీ అవుతున్నారు నాని. మొత్తానికి నాని దూకుడు మామూలుగా లేదిప్పుడు.