కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, మాజీ రేడియో జాకీ అపర్ణా వస్తారే కన్నుమూశారు. గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అపర్ణా (57) రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. అపర్ణ వస్తారే మరణంపై కన్నడ పరిశ్రమ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అపర్ణా వ్యాఖ్యాతగానే కాకుండా నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాలు, సీరియల్స్‏లో కీలకపాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పలు స్క్రీన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది మా మెట్రో ప్రకటనతోపాటు అనేక ప్రకటనలలోనూ కనిపించింది.

అలాగే చందన్ వాహినిలో అపర్ణ పలు కార్యక్రమాలను నిర్వహించింది. కొన్నాళ్లపాటు భారత ప్రభుత్వ ‘వివిధ భారతి’లో రేడియో జాకీగా కూడా పనిచేశారు. 1998లో ఎనిమిది గంటలపాటు నిర్వహించిన దీపావళి కార్యక్రమాన్ని రికార్డు చేశారు. అపర్ణ ‘మూడలమనే’, ‘ముక్త’ వంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. చివరగా 20213లో బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 1లో పాల్గొంది. 2015లో సృజన్ లోకేష్ సారథ్యంలో మొదలైన ‘మజా టాకీస్’ కార్యక్రమంలో వరలక్ష్మి పాత్రలో అపర్ణ నటించింది. బెంగుళూరులోని నమ్మ మెట్రో రైలులో ప్రయాణీకులకు సూచనలు అందించిన వాయిస్ అపర్ణదే. తన గొంతుతో కన్నడ ప్రజలకు దగ్గరయ్యింది అపర్ణ. పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన ‘మసనాడ పువ్వు’ సినిమా ద్వారా అపర్ణ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె చివరి చిత్రం ‘గ్రే గేమ్స్’ ఇటీవల విడుదలైంది.

2005లో, అపర్ణ ఆర్కిటెక్ట్, కవి నాగరాజ్ వస్తారేని వివాహం చేసుకున్నారు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‏తో బాధపడుతున్న అపర్ణా.. కీమో థెరపీ కూడా చేయించుకున్నారు. కానీ జూలై 11న ఆమె ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అపర్ణా పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం బనశంకరిలోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు