అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. శుక్రవారం (జులై 12) అనంత్ అంబానీ, రాధికలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక శనివారం (జులై 13)న రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదలు కొని హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, టీమిండియా క్రికెటర్లు, రాజకీయ నాయకులు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు అనంత్ అంబానీ రిసెప్షన్ కు హాజరయ్యారు.

కాగా ఈ పెళ్లి వేడుకల కోసం వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి హాజరైన అతిథులకు కూడా ఖరీదైన బహమతులు ఇచ్చారని సమాచారం.ఇదిలా ఉంటే అనంత్ అంబానీకి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ ఇలా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అనంత్ అంబానీ ఫ్రెండ్స లిస్ట్ లో ఉన్నారు. అందుకే అంబానీల ఇంట్లో ఏ వేడుక జరిగినా ఇట్టే ప్రత్యక్షమైపోతుంటారీ బాలీవుడ్ హీరోలు. ఇప్పుడు వీళ్లకు తన పెళ్లి సందర్భంగా ఖరీదైన లగ్జరీ వాచీలు కానుకగా ఇచ్చాడు అనంత్ అంబానీ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

బ్రాండెడ్ అండ్ లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన ‘అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్’ వాచీలను అనంత్ బహుమతులుగా ఇచ్చాడు. మార్కెట్‌లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్ల పైమాటేనని తెలుస్తోంది. వీటితో షారుక్ ఖాన్, రణ్‍‌వీర్ సింగ్ పోజులిచ్చిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.