ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం బాలీవుడ్ మేకర్స్ కు పెద్ద సవాల్ గా మారిపోతోంది. ఎంత స్టార్ హీరో అయినా బజ్ లేకపోతే నిర్మొహమాటంగా టికెట్లు కొనడం లేదు. టాక్, రివ్యూలను జాగ్రత్తగా విశ్లేషించుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ తాజా చిత్రం సర్ఫిరాకు ఇది బాగా అనుభవమవుతోంది. మొన్న శుక్రవారం వచ్చిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ కి వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. క్రిటిక్స్ కు ముందే షోలు వేసి అద్భుతం అని ప్రమోట్ చేయించినా సరే ప్రయోజనం కలగలేదు. పై పెచ్చు రెండు వారాల పాత సినిమా కల్కి 2898 ఏడి బుకింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి.

దీనికో కొత్త ఎత్తుగడను కనిపెట్టాయి మల్టీప్లెక్సులు. ప్రముఖ పివిఆర్ ఐనాక్స్ సంస్థ సర్ఫిరాకు వస్తే రెండు సమోసాలతో పాటు ఒక టీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అఫ్కోర్స్ కొన్ని కండీషన్లు ఉంటాయి లెండి. మాములుగా ఇలాంటి సముదాయాల్లో ఒక సమోసా ధర ఎంత లేదన్నా వంద రూపాయలకు పైనే ఉంటుంది. అలాంటిది రెండు ఫ్రీగా ఇవ్వడమంటే మాటలు కాదు. ఖచ్చితంగా ఆకర్షితులయ్యే ఆడియన్స్ ఉంటారు. పై పెచ్చు ఒక టీ కూడా వస్తుంది కాబట్టి ఎంచక్కా సినిమా చూసుకుంటూ, స్నాక్ తింటూ, తేనీరు సేవిస్తూ బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ని ఆస్వాదించవచ్చు.

గత కొంత కాలంగా మార్కెట్ బాగా తగ్గుతూ పోతున్న అక్షయ్ కుమార్ సర్ఫిరా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. కాకపోతే సూర్య ఆకాశం నీ హద్దురా రీమేక్ కావడంతో జనంలో అంతగా ఆసక్తి కనిపించలేదు. పైగా మూవీ కూడా అమోఘంగా ఉందనే మాట కామన్ పబ్లిక్ నుంచి బయటికి రాలేదు. ఇదంతా కాసేపు పక్కనపెడితే రాబోయే రోజుల్లో పాప్ కార్న్, కూల్ డ్రింకులు ఇచ్చి మరీ ప్రేక్షకులను ప్రసన్నం చేసుకునే రోజులు వచ్చేలా ఉన్నాయి. కల్కి, హనుమాన్ లాంటి వాటికి ఈ అవసరం పడదు కానీ రీమేకులు, యావరేజ్ బొమ్మలు మాత్రం ఈ కష్టాలు చవి చూడక తప్పదు. పరిస్థితి అలా మారిపోయింది.