బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమ్రాన్ హాష్మీకి మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు మర్డర్, మర్డర్ 2, టైగర్ 3, జన్నత్, ఆషిక్ బనాయా ఆప్నే, రాజ్ 3, హమారీ అధూరి కహానీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఇమ్రాన్ హాష్మీ సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండేవి. ప్రతి మూవీలో లిప్ లాక్ సీన్ ఉండడంతో.. ఆ హీరోకు సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు అడియన్స్. లిప్ లాక్ సీన్స్ ద్వారానే ఇమ్రాన్ హాష్మీ చాలా పాపులర్ అయ్యాడు. అలాగే అతడి సినిమాల్లోని చాలా సాంగ్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఇమ్రాన్ హాష్మీ.. ఆ తర్వాత మాత్రం వరుస డిజాస్టర్స్ వెంటాడాయి. అతడు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఈ హీరో.. ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నాడు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే హిందీలోనూ పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఇమ్రాన్ హాష్మీ ఓ రిస్క్ తీసుకున్నాడు. హీరోగా మంచి క్రేజ్ ఉన్న సమయంలో నెగిటివ్ రోల్ పోషించాడు. ఆ సమయంలో తనను చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హెచ్చరించారని.. కెరీర్ ఖతమవుతుందని అన్నారని గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ హాష్మీ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

2010లో వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమాలో షోయబ్ ఖాన్ పాత్రలో నటించాడు ఇమ్రాన్ హాష్మీ. ఈ చిత్రాన్ని గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంను ఆధారంగా తీసుకుని రూపొందించారు. ఈ మూవీ ఆఫర్ చేయగానే ఇమ్రాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అతడి బంధువు డైరెక్టర్ మహేష్ భట్ మాత్రం తనను హెచ్చరించారట. రిస్క్ అవసరమా.. ? అదొక నెగిటివ్ క్యారెక్టర్ ఆలోచించుకో అని సూచించాడని అన్నారు. షోయబ్ పాత్రలో నటిస్తే కెరీర్ ఖతమవుతుందని అన్నారని.. తీరా ఆ సినిమా మాత్రం సూపర్ హిట్ అయిందని అన్నారు. అప్పుడు ఆ సినిమా దర్శకుడు మిలన్ లుథిరాను పిలిచి తన అంచనా తప్పైందని మహేష్ భట్ క్షమాపణలు చెప్పాడని కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ చూస్తామని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.