ఢిల్లీలో కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది.

ఢిల్లీలో కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిధుల వ్యయానికి ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం చంద్రబాబు వెల్లడించారు. ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు అంశాన్ని కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లాలని ఆయన వివరించారు.

పోలవరంలో మొదటి దశ, రెండో దశ అంటూ ఏమీ లేదని, ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. త్వరలో నిర్ణయం తీసుకోకుంటే ఆంధ్రా మరో సీజన్‌ను కోల్పోవాల్సి వస్తుందని ఆయన వివరించారు.

కొత్త డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌కు అప్పగించినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం తెలిపారు. వరద తగ్గిన తర్వాత పనులు ప్రారంభిస్తే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రెండేళ్లు పడుతుందన్నారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలు చేయాలని, రాష్ట్రానికి పాత బకాయిలు చెల్లించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.

స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ కార్యక్రమాల్లో ఏపీ వెనుకబడి ఉందన్నారు. ఈ రెండు పథకాల అమలులో ఏపీ చివరి నుంచి మూడో స్థానంలో నిలవడం బాధాకరం. వైసీపీ హయాంలో కేంద్ర నిధులు పక్కదారి పట్టాయన్నారు. వైసీపీ హయాంలో అప్పులు పెరిగిపోయి అభివృద్ధి కుంటుపడిపోయి పోలవరం ప్రాజెక్టు నాశనమైందని సీఎం మండిపడ్డారు.