మంత్రి రాంప్రసాద్ రెడ్డి: ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తామన్నారు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అందుకు అవసరమైన అన్ని  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నేడు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ శాప్ ఉన్నతాధికారులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Also Read: వైసీపీ అభ్యర్థి బొత్స నామినేషన్.. టీడీపీ అభ్యర్థి ఎవరు?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ క్రీడలను పూర్తిగా విస్మరించిందని.. ఆడుదాం ఆంధ్రా అంటూ రూ.120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుని అసలైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి పేరుతో ఐపీఎల్ క్రికెట్ టీంను సిద్ధం చేస్తామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు.

Also Read: ప్రాణం తీసిన వాటర్ హీటర్.. ఫోన్ మాట్లాడుతూ..!

వారికి అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. క్రీడలకు ప్రధాన్యత ఇవ్వాలని.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ అనే తేడా లేకుండా విద్యార్థులకు ఆడుకోవడానికి గంట సమయం కేటాయించేలా టైం టేబుల్ ఏర్పాటు చేయిస్తామని.. క్రీడామైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇస్తామన్నారు.అవసరమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. క్రీడా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.

The post AP: ఈ నిబంధనలు పాటించాల్సిందే.. పాఠశాలలకు మంత్రి హెచ్చరిక..! appeared first on Rtvlive.com.