• డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ అరెస్టు
  • 14 రోజుల రిమాండ్‌
  • రేప్ చేయబోయాడంటూ లావణ్య ఫిర్యాదు

Guntur Drugs Case Update: గుంటూరు డ్రగ్స్‌ కేసులో నగరానికి చెందిన రావి సాయి మస్తాన్‌ రావును విజయవాడ సెబ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసులో పలువురు యువకులు కూడా పోలీసులు గుంటూరులో అరెస్టు చేశారు. ఇటీవల వార్తల్లో నిలిచిన టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్, లావణ్యల ప్రేమ వ్యవహారం సందర్భంగా సాయి మస్తాన్‌ పేరు తెరపైకి వచ్చింది. గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన లావణ్య.. మస్తాన్‌పై పలు ఆరోపణలు చేశారు. సాయి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నదని, తనను రేప్ చేయబోయాడంటూ లావణ్య ఫిర్యాదు చేశారు.

గుంటూరుకు చెందిన యనమల గోపీచంద్‌ అనే యువకుడు ఢిల్లీలో 35 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ కొనుగోలు చేసి.. రైలులో విజయవాడ చేరుకున్నాడు. జూన్‌ 3న రైలు దిగి బయటకు వస్తుండగా సెబ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గోపీచంద్‌ కోసం రైల్వేస్టేషన్‌ బయట కారులో ఎదురుచూస్తున్న కాంతి కిరణ్, షేక్‌ ఖాజా మొహిద్దీన్, షేక్‌ నాగూర్‌ షరీఫ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని సెబ్‌ పోలీసులు విచారించగా.. సాయి మస్తాన్‌ పేరు బయటికి వచ్చింది. మస్తాన్‌ ఇచ్చిన చిరునామాతో గోపీచంద్‌ ఢిల్లీ వెళ్లి డ్రగ్స్‌ తెచ్చినట్లు వారు అంగీకరించారు. దీంతో విజయవాడ పోలీసులు సాయిని ఏ5గా చేర్చి.. రెండు నెలలుగా గాలిస్తున్నారు. చివరకు సోమవారం ఉదయం గుంటూరు జీటీ రోడ్డులోని మస్తాన్‌దర్గా వద్ద అతడిని అరెస్ట్ చేశారు.

Also Read: Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ ఒక్కరోజే తులంపై వెయ్యి పెరిగింది!

సాయి మస్తాన్‌ను విజయవాడలోని 6వ ఎంఎం కోర్టులో విజయవాడ పోలీసులు హాజరుపర్చారు. కోర్టు మస్తాన్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మస్తాన్‌ బిటెక్‌ పూర్తి చేసి.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మస్తాన్‌పై అన్యాయంగా కేసులు పెడుతున్నారని అతని తండ్రి రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సర కాలంగా తమ కుమారుడ్ని వేధిస్తున్నారని అంటున్నారు. రామ్మోహన్ గుంటూరులో దర్గా నిర్వహిస్తున్నారు.

దర్గాకు వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీతో ఏర్పడిన పరిచయాలు సాయి మస్తాన్‌ను డ్రగ్స్ వైపు మళ్లించాయా? లేదా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలోనే సినీ ప్రముఖుల పరిచయాలు జరుగుతున్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు డ్రక్స్ కేసులో కొందరు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ హోటల్‌ యజమాని పిల్లలతో పాటు గతంలో ఓ ప్రజాప్రతినిధి సోదరుడి కొడుకుపై కూడా డ్రగ్ సప్లై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జరిగిన అరెస్టుతో ఎంతమంది డ్రగ్స్ సప్లయర్లు బయటపడతారో అన్న ఉత్కంఠ నెలకొంది.