పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 వరకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని గతంలో చెప్పమని అన్నారు. ఆనాడు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.1,50,000 రుణమాఫీ చేసి రైతులను అప్పుల ఉబిలా నుంచి బయటకు తెచ్చామని అన్నారు. ఈరోజు మూడో విడత రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. ఈరోజు రూ.1,50,000 నుండి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. 

ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు అని అన్నారు. అర్హులైన అందరికి రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. రుణమాఫీ కానీ వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రుణమాఫీ జరగని వారికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తప్పకుండ వారందరికీ రుణమాఫీ జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

త్వరలో రైతు భరోసా..

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకానికి రైతు భరోసా గా పేరును మారుస్తూ ఏడాదికి ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందించనుంది. వాస్తవానికి జూన్, జులై నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా..  రుణమాఫీ ప్రక్రియతో ఈ పథకం అమలుకు ఆలస్యం అయిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ పథకానికి నిధులు ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో వేచి చూడాలి.