• మలయాళ సినీ పరిశ్రమపై సంచలన రిపోర్ట్..

  • నటి భావన కేసు తర్వాత ఏర్పడిన హేమా కమిటీ..

  • మహిళలపై లైంగిక వేధింపులు.. శారీరక సంబంధాల కోసం ఒత్తిడి..

  • ఛాన్సుల కోసం ఇష్టం లేకున్నా లొంగిపోతున్నట్లు నివేదిక..

  • క్రిమినల్ గ్యాంగ్స్ చేతుల్లో మలయాళ ఇండస్ట్రీ..

Hema Committee report: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపుల గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌‌కి నివేదిక అందించింది. 2017లో నటి భావనపై కారులో లైంగిక దాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమెను కారులో తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడిగా స్టార్ హీరో దిలీప్ ఉన్నాడు. ఈ ఘటన తర్వాత అప్పటి ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీలో మహిళల వేధింపులకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు.

తాజాగా ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను కమిటీ రిపోర్టు వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు, దోపిడి, అసభ్యంగా ప్రవర్తించడం సహజంగా మారిందని నివేదిక వెల్లడించింది. పరిశ్రమను ‘‘క్రిమినల్ గ్యాంగ్స్’’ నియంత్రిస్తున్నాయని ఆరోపించింది. తమకు లొంగని మహిళల్ని వేధిస్తున్నారని, కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్లతో కూడిన ‘‘పవర్ నెక్సస్’’ ఉందని ప్యానెల్ ఆరోపించింది.

Read Also: Governor CV Ananda Bose: కోల్‌కతా కేసు నేపథ్యంలో ఢిల్లీలో బెంగాల్ గవర్నర్.. రాష్ట్రపతితో భేటీకి ఛాన్స్..

అవకాశాల కోసం రాజీ పడుతున్న మహిళలకు కోడో నేమ్స్ పెడుతున్నారని, లొంగని వారిని ఇండస్ట్రీకి దూరం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇండస్ట్రీలో పేరు పొందిన నటులు, దర్శకులు తమ స్వార్థానికి మహిళపై లైంగిక వేధింపులు, శారీరక సంబంధాల కోసం వేధిస్తున్నారని కమిటీకి నటీమణలు వాంగ్మూలం ఇచ్చారని తెలుస్తోంది. రాత్రిపూట మగవాళ్లు గది తలుపులు తట్టడం ఆనవాయితీ ఉందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మహిళా నటులు ఉన్న గది తలుపులను మద్యం మత్తులో పగలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని నివేదిక చెప్పింది. అవకాశం రావాలంటే రాజీ పడటం, లొంగిపోవడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా మారినట్లు కమిటీ నివేదిక వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి పటిష్ట చట్టం అవసరమని, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ కె.హేమ సిఫార్సు చేశారు. లైంగిక వేధింపులకు గురైన వారిలో చాలా మంది భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదని పేర్కొంది.

సినిమాల్లోని మహిళలు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి ఇతర మహిళలు లేదా దగ్గరి బంధువులతో మాట్లాడటానికి చాలా ఇష్టపడరు లేదని పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు తమకు వెల్లడించిన లైంగిక వేధింపుల కథనాలు విని షాక్ అయ్యానని కమిషన్ తెలిపింది. ఒక నటి ఈ విషయాన్ని కోర్టుకు లేదా పోలీసులకు ముందు చెబితే వారు ప్రాణహానితో సమా దారుణమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రాణాలకు ముప్పుతో పాటు వారి సన్నిహిత కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం ఉంటుందని రిపోర్ట్ పేర్కొంది.