తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. రాష్ట్రం సాధించాకా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి వల్ల బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడంతో.. ఆ పార్టీ గ్రాఫ్‌ మరింత దిగజారిపోయింది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో తీర్థం పుచ్చుకున్నారు. అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్‌.. రేవంత్‌ సర్కార్‌ను ప్రశ్నిస్తూనే ఉంది. ఆరు గ్యారెంటీల హామీలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా గతంలో చేసిన బీఆర్‌ఎస్‌ తప్పులను ఎత్తిచూపుతూ కౌంటర్‌ ఎటాక్‌లు చేస్తున్నారు.