• బెంగాలీ నటి ఫిర్యాదు
  • డైరెక్టర్‌ రంజిత్‌పై కేసు నమోదు
  • చీకటి కోణాన్ని హేమ కమిటీ బహిర్గతం

Kerala Police register case against Director Ranjith: ప్రముఖ మలయాళ డైరెక్టర్‌, నిర్మాత రంజిత్‌పై కేసు నమోదు అయింది. ఓ బెంగాలీ నటి ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు సోమవారం ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రంజిత్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ ఎస్ శ్యాంసుందర్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం హేమా కమిటీకే ఈ కేసును అప్పగించనున్నారు.

సినిమా షూటింగ్ సమయంలో రంజిత్ తనను లైంగికంగా వేధించాడని, ఉద్దేశపూర్వకంగానే తనను తాకేవాడని బెంగాలీ నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009లో పాలెరి మాణిక్యం సినిమా ప్రీ ప్రొడక్షన్ సమయంలో రంజిత్‌ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చారు. కేరళ ప్రభుత్వంకు హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత మరో నటి కూడా తన చేదు అనుభవాలను చెప్పారు.

Also Read: SSMB 29: వెయ్యి కోట్లతో కౌంట్‌డౌన్.. మహేష్-రాజమౌళి సినిమా అందుకే ఆలస్యం?

తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన డైరెక్టర్‌ రంజిత్.. ఆదివారం కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బెంగాలీ నటి కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేయడంతో రంజిత్‌పై కేసు నమోదైంది. మలయాళ ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని హేమ కమిటీ బహిర్గతం చేసింది. కొందరు ప్రముఖులు ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తారని, మహిళా ఆర్టిస్టులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో పలువురు నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు.