• వివాదంలో చిక్కుకున్న నెట్‌ఫ్లిక్ వెబ్ సిరీస్..

  • ‘‘IC 814 ది కాందహార్ హైజాక్’’పై విమర్శలు..

  • ఇందులో రెండు తప్పులు ఉన్నాయన్న నిజమైన పైలట్ కెప్టెన్ దేవీ శరణ్..

IC 814 The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘‘IC 814 ది కాందహార్ హైజాక్’’ సంచలనంగా మారింది. 1999లో ఖాట్మాండు-న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC 814 హైజాక్ ఘటన ఇతివృత్తంగా ఈ సిరీస్ రూపొందించబడింది. అయితే, ఇప్పుడు ఈ వెబ్‌ సిరీస్ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. హైజాక్ చేసిన ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదుల్లో ఇద్దరిని భోళా, శంకర్ అనే హిందువుల పేర్లతో పిలవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ని టార్గెట్ చేశారు. ఉగ్రవాదుల గుర్తింపును మార్చి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు ఆరోపించారు. మరోవైపు కేంద్రం కూడా నెట్‌ఫ్లిక్స్‌కి సమన్లు జారీ చేసింది.

Read Also: Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా.. పతక విజేతల పూర్తి జాబితా ఇదే!

ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లో రెండు తప్పులు ఉన్నాయని ఐసీ 814 నిజమైన పైలట్ కెప్టెన్ దేవీ శరణ్ తెలిపారు. వెబ్ సిరీస్‌లో చూపించినట్లు విమానానికి సంబంధించిన ప్లంబింగ్ లైన్లను తాను రిపేర్ చేయలేదని, అయితే ఉగ్రవాదులకు అవి ఎక్కడ ఉంటాయో తెలియకపోవడంతో విమానం హోల్డ్‌లోకి తీసుకెళ్లానని చెప్పారు. ఇదే విధంగా అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ తమకు సెల్యూట్ చేయలేదని, కానీ ఆయన మా ప్రయత్నాలను అభినందించారని వెల్లడించారు.

పాకిస్తాన్‌కి చెందిన హర్కత్ ఉల్ ముజాహీదీన్ ఉగ్రసంస్థ ఇండియాలో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాదుల్ని విడిపించేందుకు ఈ చర్యకు పాల్పడింది. జైషే మహ్మద్ చీఫ్ మైలానా మసూద్ అజార్‌తో పాటు అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ముగ్గురు ఉగ్రవాదుల్ని బందీల కోసం విడుదల చేశారు. ఈ హైజాక్ ఘటనలో ఒక ప్రయాణికుడిని ఉగ్రవాదులు చంపేశారు.