అది 2009 ఎన్నికల సమయం.. నాటి సీఎం వైఎస్సార్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు జట్టు కట్టారు. మరో వైపు మార్పు కోసమంటూ చిరంజీవి నాయకత్వంలో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో.. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ లో అందరి దృష్టి భువనగిరిపై పడింది. ఇందుకు కారణం జిట్టా బాలకృష్ణారెడ్డి. యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, రసమయి బాలకిషన్ లాంటి కీలక నేతలతో కలిసి కేసీఆర్ పై తిరుగుబాటు చేసిన జిట్టా.. భువనగిరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీలో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డికి కేటాయించడంతో ఆయన టీఆర్ఎస్ పై పోరాటానికి దిగారు. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో ఆయన స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు.