సామినేని ఉదయభాను: ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. మరికొంత మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను కాపాడుకునేందుకు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో నేత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని విడనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ నెల 24న చేరిక అంటూ… 

ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీలో కీలక నేతగా ఉన్న సామినేని ఉదయభాను గత కొంత కాలంగా జగన్ తో సహా వైసీపీ అధిష్టానంపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తాను పార్టీ మారుతున్నట్లు హింట్ ఇస్తున్నారనే చర్చ కూడా పార్టీలో జోరుగా జరుగుతోంది. ఈ నెల 24న ఆయన జనసేనలోకి చేరుతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో 23వ తేదీన కార్యకర్తలు ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కానున్నట్లు తన కార్యాలయం నుంచి నియోజకవర్గాల్లోని గ్రామాల నాయకులకు కార్యకర్తలకు సమాచారం అందించారట.

ఇప్పటికే జనసేన నాయకులు పలుమార్లు పార్టీ చేరికపై సామినేని చర్చించినట్లు తెలుస్తోంది. జరిపిన చర్చలు సఫలం కావడంతో జనసేన నుంచి లైన్ క్లియర్ అయిందని.. ఈనెల 24న లేదా 27 జనసేన కండువా ఆయన కప్పుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బ్యానర్ లు, పార్టీ జెండా దిమ్మ లు పనులు నియోజకవర్గం లో జరుగుతున్నాయి. కాగా పార్టిపై ఆయన స్పందించడం లేదా ఖండించక పోవడంతో జనసేనలో ఆయన చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతారా? లేదా జగన్ కు అండగా ఉంటూ వైసీపీలో కొనసాగుతారా అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది.