తెలంగాణలో సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు ఏడు నెలలు గడుస్తోంది. పంచాయతీ ఎన్నికలతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరగతాయనే దానిపై ఇంకా ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో బీసీ కుల గణన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆలోపే బీసీ కుల గణన కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను వెలికి తీయాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నేతలందరూ గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

దీన్నిబట్టి చూస్తే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ లేదా జనవరి నెలలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రేవంత్ సర్కార్.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాకే కులగణన చేస్తామని ప్రకటించింది. దీంతో బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరోవైపు ఆరు గ్యారెంటీల అమలుపై, రుణమాఫీ అందరికీ అందలేదన్న అంశాలపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా మంచి మార్కులు కొట్టేయాలనే యోచనతోనే బీసీ కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ పోలీసుల అలర్ట్.. నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తి చేయడం సాధ్యమవుతుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ దీనిపై ఎవరైనా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం లాంటివి చేస్తే.. మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. కుల గణన చేయడం పూర్తయ్యాకా వాటి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాదు కులగణనలో ఏవైనా లోపాలు తలెత్తడం, ఫిర్యాదులు రావడం లాంటి సమస్యలు కూడా రావొచ్చు. అంతేకాదు బీసీ కుల గణనను మూడు నెలల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. మరి మూడు నెలల్లో దీన్ని పూర్తి చేయడం సాధ్యమవుతుందా ? లేదా ? అనే దానిపై సందేహం నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. మరోవైపు గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరిలోనే ముగిసిపోయింది. ప్రస్తుతం పంచాయితీల్లో అధికారుల పాలన నడుస్తోంది. సర్పంచులు కాకుండా ఇలా అధికారుల పాలన ఉంటే.. కేంద్రం నుంచి నిధులు రావడం కాస్త కష్టమవుతుంది. మరోవైపు సీఎం రేవంత్ కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తప్పకుండా తీసుకొస్తామని ఇటీవల అన్నారు. మొత్తంగా చూసుకుంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఈసారి ఆలస్యంగా జరుగుతాయని స్పష్టమవుతోంది.

ఇది కూడా చదవండి: కోరిక తీర్చలేదని తలను అద్దంకేసి కొట్టాడు.. జానీ మాస్టర్‌ కేసులో సంచలన నిజాలు!