శ్రీవారి లడ్డూలో కల్తీ ఉందని వార్తలు రావడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు నెయ్యి వంటివి కలిపారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కల్తీ నెయ్యి వాడకం అన్ని కూడా గత ప్రభుత్వం కావాలనే చేసిందనే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి లడ్డూకు కావాల్సిన నెయ్యిని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరా చేసింది. ఈ డెయిరీ ఫుడ్‌ పంపించే నెయ్యిలోనే కల్తీ ఉందని ఆరోపణలు రావడంతో ఏఆర్ డెయిరీ ఫుడ్ స్పందించింది. తమిళనాడులోని దిండిగుల్‌లో ఉన్న ఈ డెయిరీ ఫుడ్ తమ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసింది.

ఆవు పాలతోనే నెయ్యి

నెయ్యిని తయారు చేయడానికి కేవలం ఆవు పాలను మాత్రమే ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. శ్రేష్టమైన నెయ్యిని తయారు చేసిన తర్వాత తప్పకుండా టెస్ట్ చేస్తామని డెయిరీ ఫుడ్ తెలిపింది. వీటికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. అన్ని రకాల టెస్ట్‌లు చేసిన తర్వాతే నెయ్యిని సరఫరా చేస్తామని వెల్లడించింది. అయితే తిరుమల లడ్డూకు కావాల్సిన నెయ్యికి కేవలం తాము మాత్రమే కాకుండా ఇంకా నలుగురు సప్లయర్లు ఉన్నారని తెలిపింది.

తమ డెయిరీ ఫుడ్ నుంచి కేవలం నాలుగు ట్యాంకర్ల నెయ్యి మాత్రమే సప్లై చేసినట్లు వివరించింది. అయితే ఏఆర్ డెయిరీ ఫుడ్ నెయ్యిలో క్వాలిటీ లేదని టీటీడీ గతంలో తమకు రిపోర్టు పంపినట్లు ఏఆర్ డెయిరీ తెలిపింది. లడ్డూల తయారీలో కేవలం మా ఏఆర్ డెయిరీకి చెందిన నెయ్యి మాత్రమే ఉపయోగించారని తాము అనుకోవడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.