మాజీ సీఎం జగన్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి నేతల రాజీనామాల గండం చుట్టుకుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరగా.. మరికొంత మంది నేతలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. సొంత పార్టీ నేతలను కాపాడుకునేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. వారికి హామీలు ఇస్తూ పార్టీలో ఉండేలా చూడాలని ముఖ్య నేతలకు జగన్ ఆదేశాలు ఇచ్చారు. కాగా వరుస పార్టీ నేతలతో జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈరోజు ప్రకాశం జిల్లా నేతలతో భేటీ..

ఇవాళ తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయం లో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంచార్జులను మార్పులు చేయవచ్చని సమాచారం. మాజీమంత్రి బాలినేని పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారు పార్టీ అధినేత జగన్.

మరో ఇద్దరు కీలక నేతలు..

జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీ కి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తన అనుచరులకు పార్టీ మార్పు పై సమాచారం ఇచ్చారు. ఆర్టీవీ తో అయన ఎక్సక్లూజివ్ గా మాట్లాడుతూ.. తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనసేన లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రేపు జగ్గయ్యపేట లో నియోజకవర్గ కార్యకర్తల తో సమావేశం కానున్నట్లు తెలిపారు. తన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే రోజు మాజీ ఎమ్మెల్యే భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.