ఇంటర్నెట్ షట్ డౌన్: జార్ఖండ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చింది. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (JGGLCCE) పరీక్షలు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. సెప్టెంబర్ 21, 22 తేదీ లలో నిర్వహించబడుతున్న ఈ పరీక్ష లో అవకతవకలు జరగకుండా సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. పోటీ పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు రోజుల పాటు రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ ఆపివేయడం వలన వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగస్తులతో పాటు సమాజంలోని దాదాపు ప్రతి వర్గంపై ప్రభుత్వ నిర్ణయం ప్రభావితం చేస్తోంది. జార్ఖండ్ ఇంటర్నెట్ నిషేధం వ్యాపారంపై చాలా చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు రోజుల్లో మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో వ్యాపారులు, దుకాణదారులు లక్షల రూపాయల మేర నష్టపోతామని వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని కోరుతున్నారు.

నో  UPI పేమెంట్స్…

జార్ఖండ్‌ లో రెండు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వల్ల ఆన్‌లైన్ నగదు చెల్లింపులకు ఆటంకం ఎదురుకానుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ చేస్తున్న సామాన్యులు ఆ రెండు రోజులు ఇక్కట్లు పడాల్సిందే. అలాగే విద్యార్థులకు  ఆన్‌లైన్ తరగతులకు హాజరు కాలేరు. ఇది కాకుండా, ఇంకా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాని సాధారణ సేవా కేంద్రాలు కూడా పనిచేయవు. దీంతో పలు ప్రభుత్వ పథకాలు, ఇతర పథకాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండదు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.