ఎంపీ విజయసాయిరెడ్డి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలిలో ఆయన కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు చేపట్టారు జీవీఎంసీ అధికారులు. సీఆర్‌జడ్‌(Coastal Regulation Zones) నిబంధనల ఉల్లఘించి అక్కడ ఆమె నిర్మాణాలు చేపట్టిందని ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.

1516, 1517, 1519, 1523 సర్వే నంబర్‌లలో ఉన్న స్థలంలో ఈ నిర్మాణాలు ఉన్నాయి. దాదాపు నాలుగు ఎకరాలను కబ్జా చేసి నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా నేహారెడ్డివి ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో పిటిషన్ వేయగా… విచారించిన ధర్మాసనం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

2 వారాల క్రితం…

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రెండు వారాల క్రితమే విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చడం ప్రారంభించారు. గతంలో దీనిపై అధికారులు నేహారెడ్డికి నోటీసులు ఇవ్వగా.. ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలను ఆపేందుకు స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. నేహారెడ్డి వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం… ప్రతివాదులుగా ఉన్న జీవీఎంసీ తరఫున న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది. ఇవి అక్రమ కట్టడాలని.. వెంటనే కూల్చివేత పనులు ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఇటీవలే అధికారులు కూల్చివేతలు ప్రారంభించగా.. తాజాగా మరోసారి మిగిలిన భవనాన్ని కూల్చివేస్తున్నారు.