గత పాలకుల పాపాలు విజయవాడలో వరద తీవ్రత పెరగడానికి తోడయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశామన్నారు. 4 లక్షల మందికి రూ. 602 కోట్ల సాయం అందించామన్నారు. బాధితుల అకౌంట్లో ఈ డబ్బులు జమ చేశామన్నారు. ఇప్పటివరకు తాను ఇలాంటి విపత్తును చూడలేదన్నారు. వీలున్నంత వరకు ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను బాధితులకు కల్పించామన్నారు. 1.15 కోట్ల ఫుడ్ ప్యాకెట్లు, 5 వేల క్వింటాళ్ల కూరగాయలు సరఫరా చేశామన్నారు. ఫైరింజన్లతో 75 వేల ఇళ్లను శుభ్రం చేయించామన్నారు.

ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ కు మించి సాయం..

20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామన్నారు. 2.50 లక్షల కరెంట్ కనెక్షన్లు తక్కువ సమయంలో పునరుద్ధరించామన్నారు. ఈ అనుభవంతో భవిష్యత్తులో ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా ఎదుర్కోగలిగే అనుభవం వచ్చిందన్నారు. వరద బాధితరులను ఆదుకునేందుకు రూ. 400 కోట్ల మేర విరాళాలు వచ్చాయన్నారు. విరాళాలిచ్చిన దాతలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. వరదల కారణంగా రూ. 6700 కోట్ల నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరద, వర్ష ప్రభావం ఉందన్నారు. అందరికీ ఒకేసారి సాయం అందించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ మించిన స్థాయిలో ఆర్థిక సాయం అందించామన్నారు.

సేవల్లో టెక్నాలజీని వివియోగించుకున్నామన్నారు. మంత్రులు నారాయణ, నిమ్మల, అనిత ఫీల్డులో బాగా పని చేశారని కితాబిచ్చారు. సీనియర్ ఆఫీసర్ సిసోడియా కూడా బాగా పని చేశారన్నారు. సేవల విషయంలో ఎవ్వరూ ఊహించని విధంగా చేశామన్నారు. గృహోపకరణాలు రిపేర్లు చేయించాం.. వాహనాలకు బీమా కూడా ఇప్పించామన్నారు. గ్యాస్ స్టౌలు కూడా బాగు చేయించామన్నారు. చిన్న వ్యాపారస్తులకు సైతం సాయం అందించామన్నారు. లోన్లు రీ-షెడ్యూల్ చేయించి కొత్త లోన్లు ఇప్పించామన్నారు. సర్టిఫికెట్లను ఉచితంగా ఇప్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ సైతం ఇప్పిస్తున్నామన్నారు.

బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారని చంద్రబాబు ఆరోపించారు. బోట్ల వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. కనీస బాధ్యత లేకుండా ఆంబోతుల మాదిరిగా వైసీపీ నేతలు వ్యవహరించారని ధ్వజమెత్తారు. అనంతపురంలో రథం కాల్చేశారన్నారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఎవరైనా కుట్రలు పన్నితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. త్వరలో ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్నారు.