తలపతి విజయ్: నేను ఇక సినిమాలు చేయను.. 2017 మేలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పిన మాట ఇది. ఫుల్‌ టైమ్‌ పొలిటిషన్‌గా జనాల మధ్యే ఉంటానంటూ ఆ నాడు చెప్పిన పవన్‌ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సినిమాల్లో నటిస్తూనే వచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన సూపర్‌ విక్టరీ సాధించింది. ఇప్పటికి సినిమాలను విడలేదు పవన్‌. అయినా రాజకీయంగానూ సక్సెస్.. అటు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా తానింక సినిమాలు చేయనని చెబుతున్నారు. ఇటివలీ రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ తన 69వ సినిమానే చివరిదంటున్నారు.

దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ద టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ 2025 అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే తన చివరి సినిమాగా విజయ్ ఇప్పటికే ప్రకటించారు.

ఇండిస్ట్రీల మధ్య ఎన్నో సారూప్యతలు..

తెలుగు, తమిళ సినీ ఇండిస్ట్రీల మధ్య ఎన్నో సారూప్యతలుంటాయి. సినిమాలపరంగా అద్భుతమైన సక్సెస్‌తో పాటు అదిరిపోయే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఎందరో సినీ నటులు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. MGR, జయలలిత, కురుణానిధి తమిళనాడులో సీఎం పదవిని అధిష్ఠంచగా.. ఇటు తెలుగులో NTR రెండుసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనూ ఎన్టీఆర్‌ సినిమాల్లో నటించారు.

సినిమాలకు దూరమైన చిరంజీవి..

ఇటు తెలుగు ఇండస్ట్రీని గమనిస్తే NTRతర్వాత ఆ స్థాయి హైప్‌లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన పార్టీని సమర్థవంతంగా నడిపించలేకపోయారు. రాజకీయ రంగ ప్రవేశం తర్వాత చిరు సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 10ఏళ్ల గ్యాప్‌ తీసుకున్న తర్వాత మళ్ళి వెండితెరపై మెరిశారు. మరోవైపు తమిళనాట మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. జయలలిత చివరిసారిగా 1992లో సినిమాల్లో కనిపించారు. రాజకీయాల్లోకి యాక్టివ్‌ అయిన తర్వాత ఆమె మళ్లి వెండితెరపై కనిపించలేదు. ఇప్పుడు విజయ్ కూడా జయలలిత తరహాలోనే సినిమాలకు వీడ్కోలు పలుకుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని రిజల్ట్..

ఫిబ్రవరి 2, 2024లో తమిళగ వెట్రి కజగం(TVK) పేరిట విజయ్ రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు నుంచే విజయ్ పొలిటిక్స్‌లో పరోక్షంగా యాక్టివ్‌గా ఉన్నారు. అంతా వెనుక నుంచి నడిపించారు. జూన్ 26, 2009లో విజయ్ దాతృత్వ కార్యక్రమాలను విజయ్ మక్కల్ ఇయక్కం అనే పేరుతో అభిమాన సంఘాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ 2011 శాసనసభ ఎన్నికలలో అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇచ్చింది. ఇక 2021 అక్టోబరులో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ సంఘం నేరుగా పోటీలోకి దిగడమే కాకుండా పాల్గొన్న 169 సీట్లలో 115 సీట్లను గెలుచుకుంది.

GST రాజకీయ ప్రకంపనలు..

విజయ్ తన సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించారు. అయితే ఆయన ఎక్కువగా జనాలకు మంచి మెసేజ్ ఇచ్చే మూవీస్‌లో క్లిక్‌ అయ్యారు. సినిమాలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారు విజయ్. 2017లో రిలీజైన మెర్సిల్‌ సినిమాలో GST విధానాన్ని తప్పుబట్టడం ద్వారా విజయ్ నాడు రాజకీయ ప్రకంపనలు రేపారు. ముఖ్యంగా బీజేపీ విజయ్‌ టార్గెట్‌గా విరుచుకుపడింది. అయితే తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ విషయంలో విజయ్‌గా అండగా నిలిచింది. ఇలా ఎన్నో సినిమాల్లో రాజకీయపరమైన అంశాలను జోడిస్తూ సంచలనాలు సృష్టించారు విజయ్.

2026లో తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు పూర్థిస్థాయిలో సిద్ధమయ్యేందుకు ఇక సినిమాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు విజయ్. అటు అభిమానులు సైతం MGR తరహాలో విజయ్‌ సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. అటు గతంలో అన్నాడీఎంకేకు విజయ్ అభిమాన సంఘం మద్దతు ఇచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి విజయ్ అక్కడున్న ప్రధాన పార్టీలకు సమాన దూరం పాటిస్తూ వచ్చారు. ఇలా తనదైన శైలిలో పొలిటికల్‌గా అడుగులు వేస్తున్న విజయ్‌ సక్సెస్ అవుతారా అంటే ఏమో ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి.

The post Actor Vijay: విజయ్ మాటమీద నిలబడతాడా! పవన్‌లా యూటర్న్ తీసుకుంటాడా? appeared first on Rtvlive.com.