Singareni: ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి ఆస్తులు, క్వార్టర్లను పరిరక్షించడం అందరి బాధ్యత అని సీఎండీ ఎన్.బలరాం అన్నారు. సింగరేణి ఆస్తుల రక్షణకు హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. బుధవారం విజిలెన్స్ విభాగం అధికారులతో భేటీ అయిన ఆయన.. సింగరేణి ఆస్తులకు సంబంధించిన అంశంపై సీరియస్‌గా ఉండాలని సిబ్బందికి సూచించారు. అలాగే మెడికల్ బోర్డులో నిర్వహణ లోపాలను గుర్తించేందుకు ఏసీబీ, సీఐడీ సహకారం కోరారు. కారుణ్య ఉద్యోగాల కోసం తప్పుడు పత్రాలిచ్చిన వారిని గుర్తించి, టెర్మినల్ బెనిఫిట్స్‌ నిలిపివేయాలన్నారు. అంతేకాదు సింగరేణిలో కాంట్రాక్టుల పనితీరుపై కూడా సీఎండీ బలరాం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రతీ ఒక్క ఉద్యోగి కృషి చేయాలి..

సింగరేణి ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్క ఉద్యోగి కృషి చేయాలి. సింగరేణి ఆస్తులు, క్వార్టర్ల పరిరక్షణకు హైడ్రా తరహా చర్యలు తీసుకుంటాం. సింగరేణి సంస్థ పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ కొంతమంది అక్రమార్కులు అమాయకులైన కార్మికులను మోసం చేస్తున్నట్లు సమాచారం అందింది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మెడికల్ బోర్డు పేరిట అక్రమలు జరగకుండా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ, నేర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించడం జరిగిందని బలరాం చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దూకుడు..

ఇదిలా ఉంటే.. చెరువులు, నాలాల్లో ఆక్రమణల కూల్చివేతకు ‘హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ(హైడ్రా)’ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని హైడ్రా చీఫ్ రంగనాత్ అన్నారు. అలాగే రాజకీయ, ఇతర విమర్శలతో ఆచితూచి వ్యవహరిస్తున్న హైడ్రా.. బుల్డోజర్‌ న్యాయంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దూకుడు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సుప్రీం ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని, వీటికి న్యాయస్థానం ఆదేశాల్లోనూ మినహాయింపు ఉందని రంగనాథ్ స్పష్టం చేశారు.

The post HYDRA: హైడ్రా కూల్చివేతలు మళ్లీ స్టార్ట్.. ఈ సారి ఎక్కడో తెలుసా? appeared first on Rtvlive.com.