• జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • 14 రోజుల రిమాండ్
  • చర్లపల్లి జైలుకు తరలింపు

Jani Master in Cherlapally Central Jail: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు అతడికి కోర్టు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ (21)పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ సాలిడ్ అప్డేట్.. ‘పవర్ స్టార్’ యుద్ధానికి సై!

కేసు నమోదు అనంతరం గత 4-5 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో గురువారం హైదరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈరోజు తెల్లవారుజామున జానీ మాస్టర్‌ను ఓ రహస్య ప్రదేశంలో విచారించారు. నగర శివారులోని ఓ ఫాంహౌజ్‌లో అతడిని విచారించినట్లు సమాచారం. విచారణలో భాగంగా పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. అనంతరం హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం.. మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.