ప్రతీ ఏడాది సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం అని కూడా పిలుస్తారు. క్యాన్సర్ రోగులకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ప్రపంచ వ్యాప్తంగా గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వ్యాధి ఉన్నవాళ్లు శారీరకంగా ఇబ్బంది పడటంతో పాటు మానసికంగా కుంగిపోతారు. ఇలా కాకుండా ఉండకుండా వారికి అవగాహన కల్పించాలని ఈ గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

వరల్డ్ రోజ్ డే ఎలా వచ్చిందంటే?

కెనడాలో మెలిండా రోజ్ అనే 12 ఏళ్ల బాలిక 1994లో బ్లడ్ క్యాన్సర్‌కి సంబంధించిన ఆస్కిన్స్ ట్యూమర్‌ బారిన పడింది. మెలిండా చివరి దశలో ఉందని, కొన్ని వారాల సమయంలో చనిపోతుందని డాక్టర్లు చెప్పారు. కానీ బాలిక ధైర్యంగా ఉండి దాదాపుగా ఆరు నెలలు జీవించింది. ఆమె కవితలతో ఇతర క్యాన్సర్ రోగులకు ఓదార్పునిచ్చింది. ఆమె క్యాన్సర్ రోగులకు చేసిన సేవకు గుర్తుగా ప్రతి ఏడాది వరల్డ్ రోజ్ డేని జరుపుకుంటున్నారు. ఇది క్యాన్సర్ బారిన పడిన వారి ధైర్యానికి, ఆశకు గుర్తుగా అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 

ఈరోజు క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, క్యాన్సర్ బారిన పడిన వాళ్లకు ధైర్యం ఇస్తుంటారు. బతకాలనే ఆశ, ధైర్యం రెండు క్యాన్సర్‌ను జయించగలవని నమ్మి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.