సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. జమిలీ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభా లెక్కించాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీకి సూచిస్తున్నాని పేర్కొన్నారు. ” పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. లోక్ సభ సీట్లు గెలిచాం. మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేస్తోంది

Also Read: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీకి సూచిస్తున్నా. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసినందుకే వారికి పదవులు అప్పగించాం. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో కచ్చితంగా అవకాశాలు వస్తాయి. నరేంద్ర మోదీని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్న సమయంలో పీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు.

బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన. రాహుల్ ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందే. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు!

నాలుగోసారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. జమిలీ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలి. తొమ్మిది నెలల్లో ఒక్క రోజు కూడా నేను సెలవు తీసుకోలేదు. భారత్‌లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 27 రోజుల్లో రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదు. రైతు రుణవిముక్తి కావడమే ప్రభుత్వ లక్ష్యం. ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని” సీఎం రేవంత్‌ అన్నారు.