Breaking: తిరుపతి లడ్డూ వివాదంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల మాంసం, కొవ్వులు కలిపి ప్రసాదాన్ని కల్తీ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని పిటిషన్‌ దాఖలు చేశారు.

తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్ కలిపారంటూ ఏసీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ వాడారని అన్నారు. ఈ విషయం తెలియగానే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన భోజనం, ప్రసాదం అందించడమే తమ లక్ష్యమన్నారు.

‘తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నాం’ అని సీఎం చెప్పారు. అయితే ఈ విషయాన్ని NDDB CALF ల్యాబ్ ధృవీకరించిందనట్లు తాజాగా టీడీపీ బయటపెట్టింది. 2024, జులై 8న లడ్డులో కలిపిన నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా.. జులై 17న ల్యాబ్‌ రిపోర్టు ఇచ్చింది. నెయ్యిలో సోయాబిన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బిన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనెతో సహా.. ఫిష్‌, ఆయిల్, పామాయిల్, గొడ్డు కొవ్వు వాడినట్లు తేలిందని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని మండిపడ్డారు.