Pawan Kalyan: తిరుపతి ఆలయంలో స్వామివారి ప్రసాదంగా పంచే లడ్డు కల్తీ జరిగింది అంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఎంతోమంది శ్రీవారి భక్తులు ఆందోళన చెందారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఈ తప్పును సరిదిద్దడం కోసం ఏకంగా దీక్ష కూడా చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. గత ప్రభుత్వ హయామంలో లడ్డులో నెయ్యికి బదులు జంతువుల నూనె ఉపయోగిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిన ఈ ఆరోపణలను వైకాపా ప్రభుత్వం తిప్పి కొట్టింది. సరైన ఆధారాలు చూపించకుండా ఆరోపణలు చేయడం సరి కాదని వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలందరూ కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి సైతం తిరుమలలో స్వామివారి సన్నిధిలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రమాణం చేయడంతో ఈ విషయం కాస్త కీలక మలుపు తిరిగింది.

ఇకపోతే ఈ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రికి కూడా లేఖ రాశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడంతో పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంలోకి ప్రధానిని లాగాల్సిన అవసరం లేదని, కొత్త ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు..

జగన్ రెడ్డిని తప్పు పట్టడం లేదు…
ఇక తిరుమల లడ్డు ఆరోపణలలో తాము వైయస్ జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడం లేదని తెలిపారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తోన్నారని పేర్కొన్నారు. ఇలా తిరుపతి లడ్డు విషయంలో జగన్ తప్పు లేదని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇలా ఒక్కసారిగా పవన్ యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయంలో గత ప్రభుత్వ తప్పిదం లేదని మరికొందరు పవన్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.