Published on Nov 4, 2024 7:01 PM IST
‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, జివి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘లక్కీ భాస్కర్’ చేయడానికి కారణం?
వెంకీ కథ చెబుతున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. బ్యాంకింగ్ నేపథ్యాన్ని తీసుకొని మధ్యతరగతి కుటుంబ కథ చెప్పడం కొత్తగా అనిపించింది. నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలి అనుకుంటున్నాను. అది ఈ సినిమాతో నెరవేరింది. నా దృష్టిలో ఇది వాస్తవ కథ. బ్యాక్‌గ్రౌండ్‌లో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో స్కాం చేయడం అనేది కొత్త పాయింట్. ఇది బ్యాంకింగ్ నేపథ్యమున్న సినిమా కావడంతో వెంకీ ఎంతో రీసెర్చ్ చేశాడు. బ్యాంకింగ్ సెక్టార్ కి చెందినవారు కూడా ఇందులో ఎటువంటి తప్పులు లేవని చెప్పడం విశేషం.
‘లక్కీ భాస్కర్’ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి కదా.. ఎలాంటి వర్క్ చేశారు?
ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలి. షారుఖ్ ఖాన్ లాంటివారు కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. మనలోని నటుడిని బయటకు తీసుకురావాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలి. భాస్కర్ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తిని ఇస్తాయి.
షూటింగ్‌లో ఏమైనా ఛాలెంజ్ లు ఎదురయ్యాయా?
ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. ప్రతి రోజూ, ప్రతి సన్నివేశం చేయడాన్ని ఆస్వాదించాను. ప్రతి దశలో ఎంజాయ్ చేశాను. ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది.