నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా, తొలి షో నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. కేవలం ప్రేక్షకుల నుండి మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లు రాబడుతోంది. కానీ, విజయం దిశగా దూసుకుపోతున్న తండేల్ ఇప్పుడు పైరసీ భూతం నుండి పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది.
ఇటీవల ఆర్టీసీ బస్సులో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం వల్ల తండేల్ నిర్మాత బన్నీ వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమకు తీరని నష్టం జరుగుతుందని, ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఆన్‌లైన్ పైరసీ వెబ్‌సైట్లు కొత్త సినిమాలను లీక్ చేయడం చాలా సాధారణం అయిపోగా, ఇప్పుడు ప్రజా రవాణా బస్సుల్లో సినిమా ప్రదర్శించడం నిర్మాతలపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.
తాజాగా, ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్లే APSRTC బస్సులో తండేల్ ప్రదర్శించారని బన్నీ వాసు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైరసీ కారణంగా సినిమా యూనిట్ ఎంతో కష్టపడి తీసిన సినిమాలు నష్టపోతున్నాయని, చిత్ర పరిశ్రమ భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే సమస్య ఎదురవడంతో, ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసులు ఫైల్ చేసినట్టు తెలిపారు.
ఈ సంఘటనపై APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ కఠిన నిబంధనలు అమలు చేయాలని సినీ పరిశ్రమ కోరుతోంది.