మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా, మరో కీలక పాత్రల్లో మరికొంతమంది ప్రముఖ నటీనటులు కూడా కనిపించనున్నారు. మరోవైపు, చిరంజీవి సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే, ఇతర ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ కు గెస్ట్‌గా హాజరవుతూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇటీవల విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా ఈవెంట్‌లో సందడి చేసిన మెగాస్టార్, తాజాగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందిన ‘బ్రహ్మ ఆనందం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ చిరంజీవిని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడగగా, చిరు తనదైన హాస్యశైలిలో సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా, బ్రహ్మానందం సినిమా తాతా-మనవడు మధ్య నడిచే కథ కావడంతో, సుమ చిరంజీవి తాత గురించి ప్రశ్నించింది. చిరంజీవి తన తాతగారి ఫోటోను చూసి స్పందిస్తూ, “మా తాత మంచి రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉన్నారు, మరొకరు బయట కూడా ఉన్నారు” అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.
అలాగే, చిరంజీవి చిన్నప్పటి ఫోటోను చూపించి, “క్లింకార తాతగారు” అంటూ సుమ సరదాగా ప్రశ్నించగా, చిరు నవ్వుతూ, “మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్ లా ఉంటుంది. నేను హాస్టల్ వార్డెన్ లా ఫీల్ అవుతుంటాను. చరణ్‌కి మగబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాను. నా వారసత్వాన్ని కొనసాగించేందుకు ఓ మగబిడ్డ రావాలి” అని సరదాగా సమాధానం ఇచ్చారు.
మెగాస్టార్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ కామెంట్స్‌ను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ, తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. చిరంజీవి హాస్యంతో నిండిన సమాధానాలు ఈవెంట్‌కు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి.