
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు రాని హీరోయిన్లను ప్రోత్సహించడమే మంచిదని, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో ఇటీవలే అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని దర్శకుడు సాయి రాజేశ్‌తో కలిసి నిర్ణయించుకున్నామని కూడా తెలిపారు. ఈ సంచలన వ్యాఖ్యలు ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జరిగినవి.
ఈ వివాదానికి అసలు కారణం హీరోయిన్ వైష్ణవి చైతన్య అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైష్ణవిని ఎస్కేఎన్ ‘బేబీ’ సినిమాతో హీరోయిన్గా పరిచయం చేశారు. తొలి సినిమాతోనే భారీ హిట్ సాధించిన వైష్ణవి ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ, ఆనంద్ దేవరకొండల సినిమాల్లో నటిస్తోంది. అయితే, ఎస్కేఎన్ ఆమెకు మరో అవకాశం ఇచ్చినా, ఆమె అంగీకరించలేదట. దీనికే ఆయన ఈ విధంగా స్పందించారనే టాక్ నడుస్తోంది.
ఎస్కేఎన్ వ్యాఖ్యలు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. తెలుగు హీరోయిన్లు ఎదుగుతున్న సమయంలో ఇలా మాట్లాడటం అసహ్యకరమని, ఇది వారిపై అన్యాయం చేసేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌లో ఊహించని వివాదంగా మారిన ఈ అంశం, ఇంతలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.