
టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు కెరీర్‌లో కీలక దశ లో ఉన్నాడు. గతంలో వరుస హిట్స్‌తో టాలీవుడ్‌ను శాసించిన పూరీ, ఇప్పుడు వరుస ఫ్లాపులతో కాస్త వెనుకబడ్డాడు. “లైగర్” ప్లాప్ తర్వాత వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” కూడా డిజాస్టర్ కావడంతో పూరీకి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనే చర్చ ఆసక్తికరంగా మారింది.
పూరీ ప్రస్తుతం మూడు ముఖ్యమైన హీరోలతో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. గోపీచంద్‌తో మరోసారి “గోలీమార్” లాంటి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తూ, నాగార్జున కోసం ఓ మాస్ ఎంటర్టైనర్ సెట్ చేస్తున్నట్లు టాక్. అలాగే, “డీజే టిల్లు” ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ తో కూడా కథ సిద్ధం చేస్తున్నాడు. కానీ, ఈ హీరోలు ఎవరు పూరీని నమ్మి ఛాన్స్ ఇస్తారన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి కోసం “ఆటో జానీ” కథను మరోసారి మెరుగులు దిద్దుతున్నాడు. చిరంజీవి ఓకే చేస్తే ఇది పూరీ కెరీర్‌కు మళ్లీ బూస్ట్ ఇస్తుందనడంలో సందేహమే లేదు. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా ఒక మంచి కథ ఉంటే సహకరిస్తానని సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి పూరీ జగన్నాథ్ దగ్గర మంచి ఆప్షన్స్ ఉన్నా, ఏది ఫైనల్ అవుతుందో చూడాలి. ఒక స్ట్రాంగ్ మాస్ కమర్షియల్ హిట్ వస్తే, పూరీ మళ్లీ తన ఫామ్‌లోకి రావడం ఖాయం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.