
టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు) ‘బాణం’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆయన ప్రతినిధి 2 చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శిరీష ను వివాహం చేసుకోనున్నాడు. గత ఏడాది అక్టోబర్ నెలలో హైదరాబాదులో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబాల మాత్రమే హాజరయ్యారు.
శిరీష స్వస్థలం భారత్ అయినప్పటికీ, ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య పూర్తి చేసి, అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసింది. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చి, తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినీ పరిశ్రమలో అవకాశాలు ప్రయత్నించడం ప్రారంభించింది. ఇదే సమయంలో నారా రోహిత్ తో పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారి, పెళ్లికి దారితీసింది.
నిశ్చితార్థం అనంతరం, శిరీష మహా కుంభమేళా లో దర్శనమిచ్చింది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, త్రివేణి సంగమం లో పవిత్ర స్నానం ఆచరించింది. ఆ సందర్భానికి సంబంధించిన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు “నారా ఇంటి కోడలు.. అసలు గుర్తుపట్టలేకపోయాం!”, “వదినా.. రోహిత్ అన్నను ఎందుకు తీసుకురాలేదూ?” వంటి కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో వీరి వివాహ వేడుకపై అధికారిక ప్రకటన రానుంది.