
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ఎంతో మంది సామాన్యులకు గుర్తింపు తీసుకొచ్చింది. ఆలా ఒకరిగా మారింది మోనాలిసా అనే యువతి. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా, ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె నీలికళ్ల అందం, ప్రత్యేకమైన హావభావాలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈమె జీవితంలో ఓ పెద్ద మార్పు వచ్చిందని తాజా వార్తలు చెబుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే సినిమాలో మోనాలిసాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీంతో, ఆమె ఓవర్‌నైట్ ఫుల్ ఫేమస్ అయిపోయింది.
అయితే, తాజాగా నిర్మాత జితేంద్ర నారాయణ్ మరో కోణాన్ని బయటపెట్టారు. సనోజ్ మిశ్రా వద్ద సినిమాను నిర్మించేందుకు సరిపడా డబ్బులే లేవని, కేవలం ఫేమ్ కోసం మోనాలిసాను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, ఈ ఆరోపణలపై మోనాలిసా స్పందించింది. తాను ఎవరైనా ట్రాప్‌లో పడలేదని, అవన్నీ వట్టి పుకార్లేనని ఖండించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకుంటున్నానని, తనతో తన కుటుంబం కూడా ఉందని స్పష్టం చేసింది. సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని, ఆయన మంచి వ్యక్తి అని చెప్పింది.
ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి, కానీ మోనాలిసా మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ముందుకు సాగుతోంది.