
ఇండియా vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా చూస్తారు. అలా ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలైన మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్, మంత్రి నారా లోకేష్ స్టేడియంలో హాజరయ్యారు. అయితే, ఈ విషయంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ‘పబ్లిసిటీ స్టంట్’ కామెంట్ పెద్ద దుమారం రేపింది.
టీమిండియా మాజీ ఆటగాడు రాయుడు, కామెంటేటర్‌గా ఉండగా ‘‘ఇలాంటి మ్యాచ్‌లకు సెలబ్రిటీలు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, అందుకే వస్తారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. నెటిజన్లు ‘‘చిరంజీవి, సుకుమార్ లాంటి వ్యక్తులు పబ్లిసిటీ కోసం రావాల్సిన అవసరం ఏముంది? వాళ్లు ఎప్పుడూ టీవీల్లో కనిపిస్తారు’’ అంటూ రాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐతే, చిరంజీవి క్రికెట్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయడాన్ని, దేశానికి మద్దతు ఇవ్వడాన్ని ఇలా వ్యాఖ్యానించడం తగదని అనేక మంది అభిమానులు మండిపడుతున్నారు. ‘‘చిరంజీవి భారతదేశం తరఫున క్రికెట్ ఆడలేదు కానీ, ఆయన దేశాన్ని గర్వపడేలా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ఇలా కామెంట్ చేయడం ఏంటీ?’’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంపై ఇప్పటివరకు చిరంజీవి లేదా సుకుమార్ స్పందించలేదు. కానీ, సోషల్ మీడియాలో రాయుడిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరి రాయుడు దీనిపై ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తాడో చూడాలి.