
దక్షిణ భారత సినీ పరిశ్రమలో త్రిష పేరు చెబితే ఇప్పటికీ అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. 41 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ, వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇటీవలే అజిత్‌తో “విడాముయార్చి” చిత్రంలో కనిపించి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన “విశ్వంభర” సినిమాలో నటిస్తోంది.
చెన్నైలో జన్మించిన త్రిష, చిన్నతనంలోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి, 1999లో ప్రశాంత్ నటించిన “జోడి” సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలిగా కనిపించిన త్రిష, మూడు ఏళ్ల తర్వాత “మౌనం పెసియాతే” ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.
25 ఏళ్ల సినీ ప్రస్థానంలో త్రిష ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకుంది. కొన్నాళ్లు సినిమాలకు దూరమైనా, తిరిగి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన త్రిష, ఇప్పుడు ఏకంగా 5 సినిమాలు చేతిలో పెట్టుకుంది. ఇంతటి కాలం సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న త్రిష ఎనర్జీ నిజంగా విశేషమే.
త్రిష కెరీర్లో మరో ముఖ్యమైన మైలు రాయి 1999లో “మిస్ చెన్నై” టైటిల్ గెలుచుకోవడం. అప్పుడే కేవలం 16 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి అందరికీ ఆకర్షణగా మారింది. చిన్నతనంలోనే అందాల పోటీలో గెలిచి, ఆపై సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో గొప్ప నటిగా ఎదిగింది.