
సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయాయి. ఏ జోనర్ సినిమా అయినా, కనీసం ఒక స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. స్టార్ హీరోయిన్లు సైతం ఈ పాటల్లో స్టెప్పులేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో, స్టార్ హీరోయిన్‌లతో ఐటెమ్ సాంగ్స్ చేయించడం టాలీవుడ్, బాలీవుడ్‌లో తరచూ చూస్తున్నాం. ఇక, స్టార్ సింగర్స్ కూడా ఈ పాటలను ఆలపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే, తాజాగా టాప్ సింగర్ శ్రేయా ఘోషాల్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తాను పాడిన ఒక ఐటెమ్ సాంగ్ పిల్లలను చెడగొట్టిందని, ఆ పాట పాడినందుకు సిగ్గుపడుతున్నా అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.
శ్రేయా ఘోషాల్ చిన్న వయసులోనే గాత్రం ద్వారా పేరు తెచ్చుకుంది. 12 ఏళ్ల వయసులో సంగీత ప్రస్థానం ప్రారంభించిన ఆమె, ఇప్పటివరకు 25,000కి పైగా పాటలు పాడింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ సహా పలు భాషల్లో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో టాప్ సింగర్స్‌లో ఒకరిగా ఉన్న శ్రేయా, అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుల జాబితాలోనూ ఉంది. కానీ, పాటలు పాడటం మాత్రమే కాదు, వాటి ప్రభావం గురించి కూడా శ్రేయా తన అభిప్రాయాన్ని బయటపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
శ్రేయా ఘోషాల్ పలు ఐటెమ్ సాంగ్స్ కూడా పాడారు. ముఖ్యంగా అగ్నిపథ్ సినిమాలోని “చిక్నీ చమేలీ” పాట ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చింది. కానీ, ఇటీవల ఆమె మాట్లాడుతూ – “చిన్న పిల్లలు కూడా ఈ పాటల అర్థం తెలియకుండా పాడేస్తున్నారు, నాప్రత్యక్షంగా నా పాటలు పాడినప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది” అని తెలిపారు. ఓ ఐదారేళ్ల చిన్నారి తన పాట పాడినప్పుడు ఆ మాటలు పిల్లలకు తగునా? అని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
శ్రేయా ఘోషాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ఐటెమ్ సాంగ్స్ ప్రభావంపై పెద్ద చర్చకు దారితీశాయి. పిల్లలపై ఈ పాటలు చెడు ప్రభావం చూపుతాయా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్. గ్లామర్, డ్యాన్స్ కోసం చేసే స్పెషల్ సాంగ్స్ నిజంగా ప్రేక్షకులపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో అనేది ప్రశ్నార్హం. శ్రేయా వ్యాఖ్యలు చూస్తే, సినిమా పాటలు వినోదాన్ని అందించడమే కాదు, సామాజిక బాధ్యత కూడా కలిగి ఉండాలి అనే సందేశాన్ని ఇచ్చినట్టే.