
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ అమెరికాలో క్యాన్సర్ చికిత్స పూర్తి చేసుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు ఎక్కువగా ఇంటికే పరిమితం అయినా, అభిమానులు, మీడియా ప్రతినిధులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో శివన్న తరచూ కలుస్తూనే ఉన్నారు. ఇటీవల ఒక టీవీ షోలో కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో కొంత నమ్మకం ఏర్పడింది. ఇక ఆయన నటించబోయే సినిమాల గురించి ఆసక్తి మరింతగా పెరిగింది, ముఖ్యంగా రామ్ చరణ్ నటిస్తున్న RC16 లో శివన్న పాత్రపై భారీ అంచనాలున్నాయి.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. మైసూర్ చాముండేశ్వరి కొండల్లో ఈ సినిమా షూటింగ్ మొదలై కొన్ని నెలలు పూర్తయింది. షూటింగ్ చాలా భాగం ముందే పూర్తవగా, శివన్న కోసం చిత్రబృందం ఎదురుచూస్తోంది. శివన్న అమెరికా వెళ్లేముందే RC16 మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇప్పుడు త్వరగా మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఈ సినిమాలో జగపతి బాబు, మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు వంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC16 తో పాటు శివన్న చేతిలో ఇంకా చాలా సినిమాలున్నాయి. క్యాన్సర్ చికిత్సకు వెళ్లే ముందు, అర్జున్ జన్య దర్శకత్వంలో ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటించిన సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ కొంతపాటి ప్యాచింగ్ వర్క్ ఇంకా మిగిలి ఉంది. తర్వాత హేమంత్ రావు దర్శకత్వంలో భైరవన్ కోనే పథ లో నటించనున్నారు.
ఆరోగ్య పరంగా మెరుగవుతున్న శివన్న త్వరలోనే మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు. RC16 తో పాటు ఆనంద్, ఘోస్ట్ 2, ఉత్తరకాండ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అభిమానులు శివన్నను త్వరగా స్క్రీన్‌పై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!