
ప్రముఖ హీరోయిన్లు తమన్నా భాటియా మరియు కాజల్ అగర్వాల్ పేరు క్రిప్టోకరెన్సీ స్కామ్ కేసులో బయటకు వచ్చింది. పుదుచ్చేరి పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ మోసానికి గురైన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అశోకన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయన సహా మరో 10 మంది సుమారు ₹2.40 కోట్ల నష్టం చవిచూశారు. మోసపూరిత కంపెనీ అధిక లాభాలు ఆశ చూపుతూ ప్రజలను మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కంపెనీ 2022లో కోయంబత్తూరులో ప్రధాన బ్రాంచ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో తమన్నా పాల్గొన్నారు, దీంతో కంపెనీకి మద్దతుగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే, మహాబలిపురంలోని స్టార్ హోటల్ లో జరిగిన మరో ఈవెంట్‌కు కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. ఆ తర్వాత ముంబయిలో భారీ పార్టీ ఏర్పాటు చేసి, వేలాది మంది నుంచి పెట్టుబడులు సేకరించారు.
ఈ కేసులో నితీష్ జైన్ (36), అరవింద్ కుమార్ (40) ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్‌ను విచారించాలి అని పోలీసులు భావిస్తున్నారు. వారు కేవలం ప్రమోషన్ కోసమే హాజరయ్యారా? లేదా స్కామ్‌లో లోతుగా ముడిపడ్డారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకు తమన్నా, కాజల్ ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ కేసు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత ఈ స్కామ్‌కు అసలు నేరస్థులు ఎవరు? అనేది స్పష్టత వస్తుందా లేదా అనేది చూడాలి.