
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏ.డి’ భారీ విజయంతో ఆయన కెరీర్ మరింత ఊపందుకుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదేవిధంగా, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో కూడా ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ నటించనున్నారు. ఇదే కాకుండా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మరో గ్రాండ్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో రానున్న సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందని సమాచారం. తాజాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపికైనట్లు తెలుస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే, రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ టాలీవుడ్లో ఆరు సినిమాల్లో నటిస్తుండగా, ఇప్పుడు ప్రభాస్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీ ఎలా నటిస్తుందో, ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే చిత్రమవుతుందా అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
