
టాలీవుడ్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, తర్వాత సుప్రీంకోర్టు లాయర్‌గా మారిన రేష్మ రాథోడ్ ఇప్పుడు అందరికీ ఓ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసిన ఆమె, తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరింది. అంతేకాదు, లాయర్ కోర్సును పూర్తి చేసి, ప్రస్తుతం భారత అత్యున్నత న్యాయస్థానం – సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోంది.
రేష్మ రాథోడ్ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందినవారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తిచేసిన ఆమె, 2012లో వెంకటేశ్ – త్రిష ‘బాడీగార్డ్’ సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈరోజుల్లో’ సినిమాలో కథానాయికగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె నటించిన ‘జై శ్రీరామ్’, ‘లవ్ సైకిల్’, ‘ప్రతిఘటన’, ‘జీలకర్ర బెల్లం’ వంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో సినీ రంగంలో కొనసాగలేకపోయిన రేష్మ, 2017లో నటనకు గుడ్‌బై చెప్పేసింది.
సినిమాల నుంచి విరమించుకున్న రేష్మ రాథోడ్, రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ పార్టీలో చేరింది. అదే సమయంలో లాయర్ విద్యను పూర్తి చేసి, ఇప్పుడు భారత సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోంది. ఆమె లాయర్‌గా మారడం టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక ఆశ్చర్యకరమైన పరిణామంగా మారింది.
రేష్మ రాథోడ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. తన లాయర్ కెరీర్ గురించి, సమకాలీన రాజకీయాలు, సామాజిక అంశాలపై తరచూ అభిప్రాయాలు పంచుకుంటుంది.
సినీ రంగం నుంచి న్యాయ రంగానికి మారిన రేష్మ రాథోడ్ గురించి టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ‘‘హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రేష్మ, లాయర్‌గా కొత్త జీవితం మొదలుపెట్టడం నిజంగా గొప్ప విషయం’’ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.