
దేశవ్యాప్తంగా కలకలం రేపిన బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. 15 కేజీల బంగారం అక్రమంగా తరలిస్తున్న సమయంలో కన్నడ నటి రన్యా రావు పట్టుబడ్డారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఆమెను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి, నాలుగు రోజుల కస్టడీ కోరారు. విచారణలో, రన్యా రావు గత ఏడాది కాలంలో 30 సార్లు దుబాయ్ వెళ్లినట్లు వెల్లడైంది. ఆశ్చర్యకరంగా, ఆమె ప్రతి ప్రయాణంలో ఒకే డ్రెస్ ధరిస్తూ, మోడిఫైడ్ జాకెట్, నడుము బెల్ట్‌లలో బంగారం దాచిపెట్టే మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రన్యా రావు ఏకంగా లక్షల్లో డబ్బులు సంపాదించిందని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ట్రిప్‌కు 12-13 లక్షలు తీసుకునే ఈ అక్రమ కార్యకలాపానికి విమానాశ్రయంలో కానిస్టేబుల్ బసవరాజు సహకరించాడని అధికారులు తెలిపారు. రన్యా రావు డీజీపీకి సంబంధీకురాలు కావడం, ఆమెకు ఉన్న రాజకీయ మరియు వ్యాపార సంబంధాలు ఈ కేసును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారుస్తూ, రన్యా రావు తండ్రి డీజీపీ రామచంద్రారావు తన కెరీర్‌లో ఎటువంటి మచ్చ లేదని అన్నారు. అయితే, 2014లో హవాలా కేసులో ఆయనపై 20 లక్షల అక్రమ లావాదేవీల ఆరోపణలు రావడం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుతోంది. ఇది కేవలం వ్యక్తిగత ఘటనా, లేకపోతే విస్తృత స్మగ్లింగ్ నెట్‌వర్క్ భాగమా? అన్నదానిపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.
ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీసు అధికారులు కూడా కలిసిపోయి ఉన్నారా? అనే కోణంలో DRI ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. రన్యా రావు నిజంగానే బలవంతంగా ఈ అక్రమ రవాణాలో పాల్గొన్నారా? లేకుండా ముందే ఈ నెట్‌వర్క్‌లో భాగమా? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.