
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2024 బడ్జెట్‌ను ప్రకటించారు. ఈసారి రూ.4,08,647 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కార్యక్రమాలు, సినీ పరిశ్రమ అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలకు పెద్ద పీట వేశారు. ముఖ్యంగా సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్ ఏంటంటే, కర్ణాటకలో సినిమా టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఇది మల్టీప్లెక్స్‌లు, నార్మల్ థియేటర్లు అన్నింటికీ వర్తిస్తుంది. ప్రజలందరికీ సినిమా చూసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒకే రేటు విధానం తీసుకువస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
ఇక సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మైసూర్‌లో 150 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ ఫిల్మ్ సిటీ కన్నడ సినిమాల కేంద్రంగా మారనుంది.
కేవలం థియేటర్లకే కాకుండా కన్నడ సినిమాలను మరింత ప్రచారం చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇది కన్నడ చిత్రపరిశ్రమ అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అవకాశం ఉంది. మొత్తానికి, ఈసారి కర్ణాటక బడ్జెట్ సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పొచ్చు.