
జ్యోతిక, దక్షిణాది సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి. అయితే ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ, తన నటనకు కొత్తదనం ఇస్తోంది. ఇటీవల ఆమె కుటుంబంతో కలిసి ముంబైకి మకాం మార్చి, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన “డబ్బా కార్టెల్” వెబ్ సిరీస్ లో జ్యోతిక పాత్ర అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఆమె ధూమపానం చేసే సన్నివేశాల్లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ముంబైలో ఫుడ్ డెలివరీ ట్రక్కుల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్, కోలమావు కోకిల చిత్రానికి అనుసరణగా ఉంది.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిక స్త్రీ పాత్రల ప్రాధాన్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయడంపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని, మహిళా పాత్రలు పూర్తిగా అభివృద్ధి చెందవని తెలిపింది. గతంలో ఆమె కూడా అలాంటి పాత్రలు పోషించినప్పటికీ, ప్రస్తుతం శక్తివంతమైన పాత్రలను ఎంచుకోవడం వల్లే ఈ స్థాయికి చేరగలిగానని వెల్లడించింది.
25 ఏళ్ల తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన జ్యోతిక, డబ్బా కార్టెల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెటిజన్లు “బాలీవుడ్‌లో కూడా జ్యోతిక రాణిస్తుందా?” అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.